హరికథ-
ఆవిర్భావం

ఉగాది, దసరా, శివరాత్రి మొదలైన పండుగ సందర్భాలలో, స్థానిక దేవ తల ఉత్సవాలలో, ఊరంతా కలిసి చందాలు వేసుకొని పురాణ ప్రవ చనం జరిపించడం నేటికీ మనం చూస్తున్నాం.

సరియైన సమయంలో వర్షాలు పడక, వ్యవసాయానికి ఇబ్బంది కలిగిన సందర్భాలలో విరాటపర్వం చదివిస్తే వర్షం కురుస్తుందని మనవారి నమ్మకం.

రోగగ్రస్థుల కాలక్షేపానికి శ్రీమంతులు నలచరిత్రను, దీర్ఘకాల రోగుల కైవల్య ప్రాప్తికి గజేంద్ర మోక్షణ ఘట్టాలను పురాణంగా చెెప్పిస్తుంటారు.

పృథు చక్రవర్తి యాగం చేసినప్పుడు యాగపురుషుని వలె పుట్టిన సూతుడే మొట్టమొదటి పౌరాణికుడనీ, విష్ణువే సూతుని రూపంలో అవతరించాడనీ మహర్షులు అన్నారు.

”శ్రవణం కీర్తనం విష్ణో: స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం”

అని భాగవతం భక్తిని తొమ్మిది విధాలుగా వర్గీకరించింది. ఇందులో శ్రవణం అనే ప్రక్రియ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. శ్రవణ నాడు లకు, హృదయ నాడులకు దగ్గరి సంబంధం ఉండడం వల్ల విన్నది తొంద రగా హృదయానికి హత్తుకుంటుంది.

”విస్తర మాధుర్య మనోజ్ఞసత్కథలు విస్పష్టంబుగా జెప్పవే” (శాంతి – 2-138) అని జనమే జయుడు వైశంపాయనుని అడుగుతాడు. ఆనాటి పాలకులు ఇష్టకథలు చెప్పించుకొని వినేవారని శాశనాలూ, సాహిత్యం చెబుతున్నాయి.

భట్టుమూర్తి వారి ఇంటిపేరు ప్రబంధం వారు. ఆనాడు రాజాస్థానాలలో కావ్య ప్రబంధాఆలను చదివి వినిపించేవారిని ప్రబంధం వారు అనే వారు. వారి తాతలు, తండ్రులు పురాణ ప్రవచనం చేయడం వల్ల వారికా పేరు వచ్చి ఉంటుంది.

ఆ కాలంలో చాలా మంది పండితులు ఈ పురాణ ప్రవచనాన్నే జీవనాధార వృత్తిగా స్వీకరించినారు. గద్వాల, చల్లపల్లి, పిఠాపురం, బొబ్బిలి, విజయనగరం మొదలైన సంస్థానాలలో ఇటువంటి పౌరాణికు లుండేవారు.

ఈ పురాణ ప్రవచనం అనేక కళారూపాలకు మాతృక. దీనికి ప్రక్క వాద్యాలు తోడయితే హరికథ అవుతుంది. వాద్యాల వారు ప్రవచనంలో పాలు పంచుకుంటే బుర్రకథ అవుతుంది. ప్రయోగంలో ఆహార్యం ధరించి మరింత మంది నటీ నటులు తోడయితే రూకమవు తుంది. అదే మరికొన్ని మార్పులు సంతరించుకుంటే వీధినాటకంగానూ, యక్షగానంగానూ రూపుదిద్దుకుంటుంది.

”హరి” అనే శబ్దానికి విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, యముడు మొదలైన అనేక అర్థాలున్నప్పటికీ ”విష్ణువు” అనే పదమే అధిక ప్రాముఖ్యత కలిగి ఉంది. తక్కిన అర్థాలు అల్ప ప్రసిద్ధాలు.

”కథ” అంటే ప్రదర్శించు, ప్రకటించు, భావించు, వర్ణించు, వ్యాఖ్యానించు అనే నానార్థాలున్నాయి. కథ అనే శబ్దానికి ”కథ’ మూల ధాతువు.

హరి సంబంధమైన కథను ”హరికథ” అంటున్నాం మరి శివ సంబంధమైన కథను ”శివకథ” అనవలెనా? అంటే అవసరం లేదు. ఎందుకంటే ‘హరి’ అనేది దేవతా సామాన్య వాచకం. అందుకే అన్ని దేవతలకు సంబంధించిన కథలనూ ”హరికథ’లుగా చెప్పవచ్చు. తొలుత కేవలం విష్ణుసంబంధమైన కథలనే చెప్పడం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు.కానీ నేడు ”హరికథ’ అనేది ఒక సంజ్ఞ. పారిభాషిక పదం.

ఒక కళారూపం.

హరికథ మొదట విష్ణువుకు మాత్రమే పరిమితమైనా కాలక్రమాన బ్రహ్మాది దేవతలు స్థానిక దేవతలు, మహాపురుషులు, జాతినేతలు, చారిత్రక వీరులు, పతివ్రతాశిరోమణులు మొదలుకొని బాబాలు, స్వాముల వరకూ వ్యాపించింది.

‘ఆస్తిక్యమును, ధర్మాధర్మములను సర్వజనమనోరంజకంగా నృత్యగీత వాద్యములతో నుపన్యసించుట హరికథ యన బరగు” అని ఆదిభట్ల నారాయణదాసు వివరణ.

భక్తిరస ప్రధాన పురాణ గాథలలో ఏదైనా ఒకటి ఎత్తుకొని, దానిని శ్రోతల మనస్సుల నాకర్షించునట్లు గద్యములు, పద్యములు, గానములు మొదలగు వాని సమ్మేళనంతో ప్రవచించుట హరికథా కాలక్షేమ మంటారు” అని జయంతి రామయ్య పంతులు నిర్వచించారు.

హరికథ ఈనాటిది కాదు. పురాణకాలంలోని నారదుడు మొట్టమొదటి హరిదాసు అటు తరువాత ఐతిహాసిక యుగంలోని కుశలవులకు నారదుడే గురువై వారితో హరికథలు చెప్పించాడు.

ఆదిభట్ల నారాయణ దాసు పూర్వం కూడా హరికథ ప్రచారంలో ఉండింది. కానీ దాసుగారు తమ అభినయ నృత్య గానాలతో సంగీత సాహిత్యాలను మేళవించి, సునిశిత హాస్య చతురతతో కథను నడిపిస్తూ హరికథకు ఒక నిర్దిష్టమైన రూపాన్నీ, విశేష ప్రచారాన్నీ కల్పించారు.

క్రీ.శ. 1880 ప్రాంతర్లో ఈ హరికథాగానం తెలుగులోకంలో ఆవిర్బవిం చిందని కొందరు స్థూలంగా నిర్ణయిం చారు. ఐతే దాసు గజ్జెకట్టి హరి దాసుగా గొంతు విప్పిందే 1883లోనే.

హరికథ అన్న పేరుతో ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్న కళారూపానికి మరిన్ని పర్యాయపదాలున్నాయి. కథ, కథాగానం, కథాకాలక్షేపం,కథా ప్రవచనం, కథా ప్రసంగం, సత్కథాగానం, సత్కథాకాలక్షేపం,హరికథా కాలక్షేపం, హరికథాగానం, హరికీర్తన అని దక్షిణ భాషలోని వ్యవహారాలు.

కీర్తన్‌, సంకీర్తన్‌ అని ఇతర ప్రాంతాల వాడుక. ఇందులో అచ్చతెనుగు పదం ఒక్కటీ లేదని నారాయణదాసు ముచ్చటగా హరికథకు ”వేల్పు ముచ్చట” అని పేరు పెట్టినారు.

”హరికథకు 19వ శతాబ్దం నుంచి యక్షగానం అన్నపేరు పర్యాయ వాచకంగా కనిపిస్తున్నది.’ అని తెలుగు హరికథా సర్వస్వమును రచంచిన తూమాటి దోణప్ప వివరించారు.

నారాయణదాసు రచించిన ఎన్నో హరికథలకు యక్షగానమనే పేరు పెట్టినారు.

హరికథకుడు సాధారణంగా పురాణంలోని ఏదో ఒక సంఘటననో లేదా ప్రముఖులు రచించిన ఏ కావ్య ఘట్టాన్నో తీసుకుని దానికి తగిన సంగీతాన్ని సమకూర్చుకొని కథనం సాగిస్తాడు.

మామూలు కథకుడైతే మూల కథను మాత్రం ఒప్పజెప్పుతాడు. ప్రతిభావంతుడైన కథకుడైతే స్థూలంగా మూలకథను అనుసరిస్తూ ఆయా సమయాలలో ఇతర కవులు రచించిన పద్యాలను, కీర్తనలను చేర్చి, వాటికి

కొంత స్వంత కల్పనను జోడించి, అనువైన చోట్ల హాస్య చతురతను మేళవించి, అవసరమైన చోట్ల లయబద్ధంగా స్మరిస్తూ తన హావ భావ విలాసాలతో ప్రేక్షకుల నలరిస్తాడు.

కథకుడు ప్రేక్షకుల స్థాయిని బట్టి తన కథా స్థాయిని కూడా మరుస్తుంటాడు. ప్రేక్షకులలో పండితులున్నప్పుడు అనేకానేక శాస్త్రోదాహరణలతోనూ, సందర్భోచిత ఇతర కవుల చాటువులతోనూ, ప్రసిద్ధ వాగ్గేయకారుల కీర్తనల తోనూ కథను పండిత ప్రియంగా నడిపిస్తాడు. అదే సంగీతజ్ఞు లున్న సభలో అనేక క్లిష్టరాగాలతో, సంక్లిష్ట తాళ, జాగాలతో సంకీర్తనలు

కృతులు, తరంగాలతో స్వరాభిషేకం చేస్తూ రసరమ్యంగా లయాత్మకంగా కథను నడిపిస్తాడు.

”ఉత్తముల ప్రతిభ నీటికొలది తామర” కదా హరికథను పూర్వరంగమనీ, ఉత్తర రంగమనీ రెండు భాగాలుగా విభజించవచ్చు. పూర్వరంగాన్ని బ్రహ్మ నిరూపణమనీ, పీఠిక అనీ అంటారు. ఇది నాటకానికి నాంది వంటిది. కథ యందు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిచండం దీని ఉద్దేశ్యం.

ఉత్తర రంగమంటే అసలుకథ. కథాపీఠమైన పూర్వరంగం పరమ లౌకికం. కథా ఘట్టమైన ఉత్తర రంగం పార లౌకికం. ఈ రెండూ కలిసి

కథకునికీ, ప్రేక్షకునికీ ఐహిక ఆముష్మికముల నిస్తాయని మన వారి విశ్వాసం.

సాధారణంగా కథకులు మూడు రకాలు

1. కులవృత్తిగా కలవారు.

2. ఉపవృత్తిగా గలవారు

3. ఔత్సాహికులు.

నేడు కులవృత్తిగా గల అనేక కథకులు తమకు ఎదురవుతున్న అనాదరణ వల్లా, ఆర్థిక ఇబ్బందుల వల్లా ఇతర వృత్తుల లోకి వెళ్లిపోతున్నారు. పూర్వం నుండీ మామూలుగా కథకునికి ఇచ్చే నూటపదహార్లూ. వెయ్యి న్నూట పదహార్లూ నేడు సరిపోవడం లేదు. కథకుడూ, వాయిద్యాల వారూ అందులోనే పంచుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఒప్పందం చేసుకున్న మొత్తం కంటే, చదివింపులద్వారా, హారతి పళ్లెం ద్వారా ఇంకా ఎక్కువ మొత్తమే రావచ్చు. కానీ అది ఆ కథకుడి అదృష్టం మీదా, ఆవూరి ప్రజల కళాభిమానం మీదా, వారి ఔదార్యం మీదా ఆధారపడి ఉంటుంది.

కథకునికీ, వాయిద్యాల వారికీ ఒద్దికలు ఉంటే ఆ కథ మరింత రంజుగా ఉంటుంది. కానీ మామూలుగా కథకునికి వచ్చే కొంతమొత్తంలోనే వాయిద్యాల వారిని వెంట తీసుకు పోవడం సాధ్యం కానిపని. అందుకే కొందరు వాయి ద్యం లేకుండానే కథనం సాగిస్తున్నారు.

ఇంకొంతమంది ఆగ్రామంలోనే ఎవరైనా వాయిద్యాలవారుంటే వారితో సరిపెట్టుకుంటారు. శృతి పెట్టెతో సరిపెట్టుకునే వారు కొందరు.

కొంతపెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని కథ ఏర్పాటు చేసుకునే వారు వాయిద్యాలను వెంట తీసుకుపోతున్నారు. ఇంకా రంజుగా కథ చెప్పాలనుకునే వారు హార్మోనియం, తబలా, వయోలిన్‌, మృదంగం, ఘటం ఇన్నింటినీ ఏర్పాటు చేసుకుని మరీ కథ చెబుతున్నారు.

హార్మోనియంలో ప్రావీణ్యం గల కథకులు కొందరు కీర్తనగానీ, పద్యంగానీ వచ్చినపుడు బల్లమీద పెట్టుకున్న హార్మోనియం వాయిస్తూ కథ చెప్పడం కూడా జరుగుతున్నది.

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ హరికథలను, హరిదాసులను పరిరక్షించడంలో తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ మధ్యన ఈ ప్రాచీన కళారూపాన్ని కాపాడుకోవాలని కృషి చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖవారు ఈ మధ్యన ”మహిళా హరికథా వారోత్సవాల”ను ఘనంగా నిర్వహించడం ముదావహం. ఈ క్లిష్ట రూపక ప్రక్రియను కాపాడు కోవడం మన అందరి బాధ్యత. ముందు తరాలవారికి దీనిని అపురూపంగా అందించడం మన కర్తవ్యం.

హరికథ ఒక నూతన విద్యా ప్రదర్శనం. దీనికి ప్రశస్తమైన సంగీతం. సాహిత్యం, చక్కని నృత్యం, అభినయం, శ్రోతల మనస్సుల కింపైన మాటలు, సందర్భానుసారమైన ఛలోక్తులు, హాస్య ధోరణి, దేశకాల పరిస్థితులకు అవసరమైన సామాజిక చైతన్య ధోరణి అన్నింటికన్నా రసమస్యమైన రూపం కావలసిన అంగములు.

హరికథాగానం యుగయుగాల నుండీ తరతరాల నుండీ ప్రజానీకానికి భక్తిభావ ప్రభోధికంగా ప్రచారితమవుతున్న ఒక ఆధ్యాత్మిక లలిత కళా సందేశం. ఇది ఒక సారస్వత విజ్ఞాన సర్వస్యం.

ఇతర కళారూపాలైన నాటకం గానీ, యక్షగానంగానీ బుర్రకథ గానీ రక్తి కట్టించుట అంత కష్టమైన పనేమీ కాదు. వీటిలో ఇతర నటీనటుల తోడ్పాటు, రంగాలంకరణ, ఆహార్యం తోడుగా ఉంటుంది. వీటి సాయంతో నవరసాలను సులభంగా మెప్పించవచ్చు.

కానీ హరికథలో అన్ని పాత్రలనూ ఒక్కడే ధరించాలి. అవిశ్రాంతంగా మూడు గంటలపాటు ఒక్కడే ప్రజలను రంజింప చేయాలి.

సంగీత సాహిత్యాలనే రెండు ప్రధాన చక్రాల మీద హరికథ అనే బండిని నడుపుతూ ప్రేక్షకులకు వేసరిక రాకుండా నృత్యం, హాస్యం అనే ప్రదేశాల వద్ద ఒకింత మజిలీ నిర్వహిస్తూ, సామాజిక చైతన్యం కలిగిస్తూ, వేదాంత మార్గం లో ప్రయాణం చేస్తూ, భక్తి అనే గమ్యాన్ని తాను చేరి ప్రేక్షకులను గూడా తనతోపాటూ తీసుకెళ్లే వాడే హరిదాసు.

Comments are closed.