‘హరికథ’కు ఆద్యుడు ఆదిభట్ల

ఆదిభట్ల నారాయణదాసు 1864 సంవత్సరం ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ‘అజ్జాడ’ అగ్రహారంలో శ్రీచయనులు, శ్రీమతి నరసమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. పువ్వుపుట్టగానే పరిమళించినట్లు ఈయనకు సూక్ష్మగ్రహత్వం సుమధుర కంఠం, నటన బాల్యంలోనే అలవడ్డాయి.
హరికథను తన ముఖ్య ప్రవృత్తిగా ఎంచుకొని సాహిత్య సంగీత, నాట్య బహుభాషా పాండిత్యంతో నారాయణదాసుకు సరితూగే పండితులు నాటినుండి నేటివరకూ ఎవరూ లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. నారాయణదాసు ఏక సంతాగ్రహి. విజయనగరంలో మెట్రిక్యులేషన్ వరకు విశాఖపట్నం ఎ.వి.ఎన్.కళాశాలలో ఎఫ్.ఎ వరకు విద్యనభ్యసించి ఆ విద్యార్థి దశలోనే ఆంగ్లం, సంస్కృతం, తెలుగు భాషల్లో అపారమైన పాండిత్యాన్ని సంపాదించి చక్కని వాక్యాలతో.. చిక్కని కవితలల్లిన మహాపండితుడు. అవధాన ప్రక్రియలు చేయడం ఈ ప్రఖ్యాతిగాంచి సహ ఉపాధ్యాయుల మెప్పుపొందిన బహుమఖ ప్రజ్ఞాశాలి.
ఆంధ్రులకే కాక భారతదేశం మొత్తం గర్వించదగ్గ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్(1913) ఆదినారాయణదాసును ‘‘ఈయన మానవ మాత్రుడంటే నేను నమ్మలేకున్నాను’’ అని ప్రశంసించారు. మన రాష్ట్రంలోనే కాకుండా మద్రాసు మైసూరు వంటి సంగీత కళాక్షేత్రాల్లో తన హరికథా గానంతో మరియు వీణావాదనంతో పంచముఖి వంటి తాళావధానాల్తో సంగీత పండితులను నిశే్చష్టుల్ని చేస్తూ ఎన్నో సత్కారాలు బహుమానాలు పొందిన సంగీత సవ్యసాచి. 1883లో తన 19వ యేట కుప్పుస్వామి అనే తమిళుని హరికథ విని ఉత్తేజం పొంది ఆ క్షణమే తనలోగల బహుముఖ ప్రజ్ఞల్ని వేదికపై ప్రదర్శించిన బహుకళాకోవిదుడు. సంస్కృతం, తెలుగు భాషల్లో 17 హరికథలు రచించారు. 1924లో చల్లపల్లిలో గజారోహణం జరిపి చెళ్లపల్లి వేంకటావధానిగారి చేత ‘‘హరికథా పితామహుడు’’ అనే బిరుదు పొందారు. వీరి రచన ‘నవరస తరంగణి’ నభూతో నభవిష్యతి అనటం అతిశయోక్తికాదు.
1919లో అప్పటి విజయనగర మహారాజా శ్రీ విజయ రామగణపతి తన పేరున ‘విజయరామ గాన పాఠశాల’ స్థాపిస్తే దానికి ప్రధానాచార్యులుగా 1919-1936 వరకు పనిచేసారు. 1942లో పదవీ విరమణ చేస్తూ జీవితాంతం సంగీత సాహిత్య కృషి సాగించారు. లయ జ్ఞానంలో నారాయణదాసుది అందెవేసిన చేయి. శివప్రోక్తమైన శివపంచముఖి తాళావధానాన్ని అవలీలగా సాధనతో 1914లో ప్రదర్శించి ‘లయబ్రహ్మ’ బిరుదు పొందారు. దాసుగారిది ఎంతో విశాలమైన హృదయం. అందుకే తను తన సంగీత కళాశాలలో సర్వశ్రీ పేరి రామ్మూర్తి (గాత్రం) కట్టు సూరన్న (వీణ) లింగం లక్ష్మజి (మృదంగం) ద్వారం వెంకటస్వామి నాయుడు (వయొలిన్) వంటి సమర్థులైన అధ్యాపకుల్ని తన పాఠశాలలో పెట్టి పాఠశాల కీర్తిప్రతిష్టలను దశ దిశల వ్యాపింపజేసిన కళాశ్రేష్ట. ఈయన మాట కుండబ్రద్దలు కొట్టినట్లు ఉండేది. ఎవ్వరినీ లెక్కచేయకపోవడంవలన విరోధులు ఉండేవారు. మాటకటువైనా మనసువెన్న. తన కుమార్తె సావిత్రి కుమారునికి స్పోటకం వస్తే దేవి ఉపాసన చేసి వ్యాధిని తనపైకి మళ్ళించుకొని ఆ మనుమడిని రోగవిముక్తిచేసి తను అదే రోగంతో 1945 సంవత్సరం జనవరి 2వ తేదీన దివంగతులయ్యారు. భారతీయులు అన్నికాలాల్లో గుర్తించుకోవలసిన మహా సంగీత, హరికథా విస్వాంసులు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.

Comments are closed.