గురజాడ వ్యక్తిత్వమూ, సాహిత్య వ్యక్తిత్వమూ కూడా చిత్రవర్ణ పట్టకం వంటివి. వాటిద్వారా ప్రతిఫలించిన దృశ్యాలు తెలుగు సారస్వతాకాశం మీద అతివిస్తృతంగా పరచుకున్నాయి. ఆయన కారణజన్ముడే అనే భావ నిర్ధారణకి మూలమైనాయి. మూడు రంగాల్లో ఆయన భావజాలపు ప్రభావం, నిర్మాణాత్మక కృషీ -శాశ్వత ముద్రని వేశాయి. అవి -సామాజిక రంగం, భాషారంగం, సాహిత్యరంగం.
వృత్తిని చూస్తే ఆయన సేవ ఆనంద గజపతి కొలువు. రాజుల సేవలో ఉన్న ఉచ్ఛనీచాల గురించిన వాస్తవాలూ, చాటువులూ కూడా జగమెరిగినవే. కాని, ఆనందగజపతి కొలువు -గురజాడ వరివస్యని ఏపుగా పెంపొందించింది. ఆయన విశ్వాసం, కఠోరశ్రమా -ఆ రాజు శ్రేయస్సుకూ అంతకంతగా కొమ్ముకాచాయి. ప్రవృత్తిని బట్టి చూస్తే -సంఘసంస్కరణాభిలాష, భాషాసాహిత్యాల పరిణామాల దార్శనికత. మురికి సమాజపు కలుషిత నీటిలో స్నానం చేయకతప్పని పరిస్థితుల్లో నిలిచి, ఆ మురికిని వదుల్చుకుని ఒడ్డుకు చేరడమెలాగో చూపాడు, చెప్పాడు. ఈ ధైర్య సాహసాలకి కారణం -ఆయనలోని ప్రయోగశీలం, నవీన దృక్పథం.
వ్యక్తిగా గురజాడ కష్టజీవి. చిన్నతనం నుంచీ కూడా తన శక్తికి మించిన శ్రమకు అలవాటుపడినవాడు.అనేక బాధ్యతల్నీ, బరువుల్నీ నెత్తికెత్తుకునే తత్వం.అవన్నీ స్వీకృతాలూ, స్వీయకృత్యాలే! ఆయన దినచర్యని పరిశీలిస్తే ఎన్నో అబ్బురపరిచే అంశాలేగోచరిస్తాయి.ఒక్కసంగతి చూడండి. అతివిస్తృతమైన పుస్తక పఠనం. ఐదు వందల పేజీల గ్రంథాన్నైనా -అతివేగంగా రెండు మూడు రోజుల్లో ఆకళింపు చేసేసుకోగల ధీధిషణలు. అవీ వయసుకు మించిన శక్తియుక్తులు. చదివిన విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని, సాధికారతతో, ఉటంకింపులతో సహా ఆ విషయాన్ని మళ్లీ స్పష్టీకరించే ప్రజ్ఞ ఆయనది. ఫిలాసఫీ చదివిన తాను “వేదాంతులకే తత్వోపదేశం చేయగలనని’ ఆయన చెప్పుకుంటూ వుండేవాడని -గురజాడ కుమారుడు రామదాసు గారు గుర్తు చేసుకున్నారు. అలాగే, ఆయనకి ఇంగ్లీషు, కన్నడం, బెంగాలీ, పారశీకం, గ్రీకు, లాటిన్ భాషల్లో అపారమైన అభినివేశం వుంది. ఎఫ్ఏ చదువుతూ ఉండగానే ఇంగ్లీష్‌లో రాసిన “సారంగధర’ పద్యాలూ, వాటి వైశిష్ట్యం, సాహితీలోకానికి ఎరుకే. ఆనంద గజపతి భాషాపోషకత్వం ఫలంగా -గురజాడ ఇంకో అనల్ప కార్యమూ నిర్వహించాడు. అదే సవరభాషా పరిశోధనా, వ్యాకరణ నిర్మాణం.గురజాడ భాషా పటిమ అటు “డిసెంట్ పత్రం’ చూసినా వ్యాసాలు చదివినా, ఇటు డైరీల్లోని అనేక సంఘటనల్ని చూసినా అర్థమవుతుంది.
గురజాడ మేథ -సర్వమూ ఆకళించుకున్న శక్తి కలిగినది. దానిది పూర్ణ ప్రజ్ఞ, బహుముఖీనత్వం. కన్యాశుల్కంలో ఆయన వాడుకున్న ప్రాచీన జానపద వైభవాన్ని చూడండి. శతకవాఙ్మయమూ, తత్వాలూ, జనంనోట నానిన పాటలూ అన్నీ ఆయనకుఉపకరించాయి. (సారాకొట్టు సీనులో దుకాణదారు పాడే వేమన పద్యం, దాన్ని అతను పాడిన తీరు గుర్తుకొస్తుంది!)
సాహిత్య ప్రక్రియల్లో ముఖ్యమైన -కవిత్వం, కథానిక, నాటకం -ఈ మూడింటిలోనూ మొట్టమొదటి సారిగా, వస్తుగతంగా, శిల్పరూపగతంగా, భాషాపరంగా ఆధునికతను అందించినవాడు గురజాడ. కవిత్వం పరంగా -ముత్యాలసరాలు సృజన, కథానిక పరంగా ఐదు ఆణిముత్యాలు, నాటకంగా”కన్యాశుల్కం’. ఈ మూడు వైవిధ్య భరితమైన రచనలమీదా -పుట్టెడు వివరణ, విశ్లేషణ, చర్చ, వాఙ్మయం మనముందు కొచ్చేవున్నై.ప్రయోగశీలిగా ఈ ప్రక్రియల ఆధునికతకు ఆయన ఆద్యుడు. ఒక్క విషయం మరువకూడదు. ఈ ఆధునిక సాహిత్య ప్రక్రియల రూపకల్పనలో, నిర్మాణంలో గూరజాడ రచనా వైశాల్యం కన్నా కూడా, రచనలోతుని ఎక్కువ చూపాడు.ముందుతరాల్ని అందుకోమన్నాడు. తన ఆధునిక భావధారనీ వాడుక భావ ఆశయాన్నీ నూత్న శిల్పనైశిత్యాన్నీ విస్తృతం చేసుకోమన్నాడు. స్రష్టగా అదీ గురజాడ! “తననాటి వరకూ ఉన్న పాత రచనల్లో యంత్రత్వం, కృతకత్వం, అశ్లీలతా, ఆడంబరత్వం మాత్రం విసర్జించి, మహాత్మ్యం స్వీకరించి పాతకొత్తల మేలుకలయికలో ఆకర్షణ సహజరీతిని సాధించి, ముట్టునదంతా రసవంతం చేసిన సువర్ణయోగి -గురజాడ అప్పారావు’ అన్నారు ఆనాటి భమిడిపాటి కామేశ్వరరావు గారు. ఆ “పాత కొత్తల మేలుకలయికే‘ గురజాడ అందించిన ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక వాంఛితార్థం!
బావించటం నాముచ్చట, ఆలోచనా బలం’ అన్నాడు. ఆ ముచ్చటవల్లనే, ఆ భావనాశక్తివల్లనే గురజాడ కృష్ణశాస్త్రి కంటే ముందుగా “పొలిమేరలలో పల్లకీ బోయీల కేకలు’ విన్నాడు. ఆ ఆలోచనా బలం వల్లనే “నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవ్వరిని సంతోషపెట్టటానికీ వదులుకోను’ అని అతిస్పష్టంగా ఒక ధృవీకరణ పత్రాన్ని జారీచేశాడు.
బాల్యవివాహ, కన్యూశుల్కం దురాచారాలపట్ల శుష్క నిరసనకాక, ఆ సమస్యల ప్రాచుర్యం ద్వారా, పర్యవసానాల హెచ్చరింపు ద్వారా -సమాజావరణం మీద సంస్కరణ పతాకని నిలబెట్టాడు. ఫలితంగా వచ్చింది. కన్యూశుల్కం నాటిక. ఇది ఒకటి. రెండు వాడుక భాషలో విద్యాబోధనకు పోరాటం. ఆ యుద్ధంలో ఎక్కడి పోరునీ నిర్వహించాడు. మడమతిప్పని ధైర్య స్థైర్యాలతో తన ఆశయాన్ని ప్రకటించాడు. సంకెళ్లను ప్రేమించే వాళ్లు గ్రాంథిక భాషను ఆరాధిస్తారుగాక! నాకు మాత్రం నా మాతృభాష జీవద్భాష. అది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’. ఈ జీవద్భాషలో మన సుఖాన్నీ, దు:ఖాన్నీ వెల్లడించుకోవడానికి మనం సిగ్గు పడటంలేదు. కానీ, దీన్ని వ్రాయడానికి మాత్రం మనలో కొంతమంది బిడియ పడుతున్నారు. వ్యావహారిక భాషలో వున్న సాహిత్యం రైతును మేల్కొలుపుతుంది. భారత దేశంలో వున్న ఆంగ్లేయుడి గుండె కదుపుతుంది. దాని శక్తి అపారం, అవకాశాలు అనంతం’ అని అనంతమైన విశ్వాసాన్నీ, చిత్తశుద్ధినీ ప్రకటించారు. తన ఆశయ కారణాన్ని పారదర్శకం చేశారు. ఇక మూడవది -సాహిత్య ప్రక్రియల్లో ఆధునికతని సాధించడం. వస్తు శిల్ప నిర్మాణ విధానాల్లో నవీనత్వ సాధన ఇది.ఈ విషయంలో గురజాడ సాహిత్యేతి వృత్తాల్లో “భారతీయత’నిలిచివుండటాన్ని ఆకాంక్షించాడు. అయితే అవి జీవితాన్ని “నూత్నం’గా దర్శించాలి. ఈ నూత్న దర్శనం, నవీనత్వం- అభ్యుదయ చోదకంగా వుండాలి. ఇదీ ఆయన దార్శనికత.”కొత్త మిన్కులతెలివి పటిమను మంచి చెడ్డలమార్చితిన్’ అన్నాడు. అప్పటివరకూ నామమాత్రంగా ఏదైతే “మంచి’గాచలామణీ అవుతున్నదో ఆ సామాజిక అవాంఛ నీయతలకి, దుస్థితికి గండికొట్టాడు. వ్యక్తికీ సంఘానికీ కూడా “చెడు’గాపరిణమించిన దుర్దశని ప్రజలముందుకు తెచ్చాడు. శ్రేయోదాయకమైన వాంఛనీయతని ప్రోదిచేశాడు.స్త్రీ చైతన్యాభిలాషిగా “ఆధునిక మహిళ చరిత్రని పునర్నిస్తుంది’అని గా ఢంగా నమ్మాడు. ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలు ఈ నమ్మకం నుంచీ జనించిన నమూనా పా త్రలే. “ఈ సమాజంలో స్త్రీల కన్నీటి గాథలకు కారణం నా కు తెలుసును.తిరిగి వివాహ మాడకూడదనే నియమం,వి డాకుల హక్కు లేని కారణం, ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం స్త్రీలకన్నీటి గాథలకు హేతువులు’ అనే సంవేదనని వ్యక్తం చేశారు.
గురజాడ మననధార మంచితనం చుట్టూ, మనిషితనం చు ట్టూ చుట్టుకు చుట్టుకు తిరిగింది. ఆ మననధారలో విశ్వమానవ భావన మనిషికి బతుకుమీద తీపినీ, బతు కు తీపిమీద ఆసక్తినీ కలిగించటంతో కేంద్రీకృతమై వుంది. “స్వంతలాభం కొంతమానుకు/ పొరుగు వాడికి తోడుపడవోయి/ దేశమంటే మట్టికాదోయి/ దేశమంటే మ నుషులోయి’ అన్న ప్రబోధం దేశభక్తిగీతం చేస్తున్నది. జాతీయ గీత మంతటి స్ఫూర్తి దాయకమైనది ఆ గీతం. “ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్వవోయి’ అంటూ “అన్న దమ్ములవలెను జాతులు/మతములన్నీ మెలకగవెనోయి’ అనటం, “మతం వేరయితేనే యేమోయి/మనసులొకటై మ నుషులుంటే/ జాతియన్నది లేచి పెరిగి/ లోకమున రాణించునోయి’ అని ఒక సర్వశ్రేయోదాయకమైన సందేశాన్నివ్వటం -ఆయన వసుధైక కుటుంబ ఆకాంక్షకి తార్కాణం.”
మంచి చెడ్డలు మనుజులందున/ ఎంచి చూడగ రెండెకులములు/ మంచి యన్నది మాలయైతే /మాలనే యగుదును’ అని అస్పృశ్యతా దురాచారాన్ని నిరసించటం మాత్రమే గాక, తనఅచంచలమైన నిబద్ధతని అక్షరీకరించాడు. “లవణరాజు కల’లో ఎంతెంత అభ్యుదయాకాంక్షనీ, ఎంతెంతచైతన్య స్ఫూర్తినీ అందించాడో సాహితీలోకానికి ఎరుకే. “పెక్కు లొక్కటిక జూచువాడే ప్రాజ్ఞు’డని తానే అన్నాడు.ఆ సూక్తికి తానే నిండు ఉదాహరణగా నిలిచాడు. అందుకనే, కిళాంబివారు గురజాడని “ప్రజాసామాన్య రక్తధ్వజము నెత్తిన’ సాహితీస్రష్ట అన్నారు.చిత్రమైన వాస్తవం ఏమంటే -150 ఏళ్ళ తర్వాత కూడా గురజాడ ఆశయాలూ ఆదర్శాలూ, ఆయన సాహిత్యనిబద్ధతా, సామాజిక అభ్యుదయాకాంక్ష -ఈనాటికీ -ప్రాసంగికతను కోల్పోకపోవటం. దీనికి కారణం ఆయన ఆలోచనల్లోని మహత్తర దార్శనికత. ఈ కారణంవల్లనే “1969లో తెలుగుదేశాన్నీ, తెలుగు,సాహిత్యాన్నీ, తెలుగు మనిషి సగటు సంస్కార స్థాయినీ కలయజూస్తే, గురజాడ భావాలలో అధిక భాగం యిరవయ్యొకటో శతాబ్దివేమో అనిపిస్తున్నది’ అని తమ “సంవేదన’ పత్రికలో 1969లోనే రాశారు రా.రా! అదే సత్యమై సాగుతోందీ నాటికీ! గురజాడ మరణ సందర్భంలో గిడుగువారు అన్నారు, “తెలుగు ప్రజల స్మృతి పథంలో అప్పారావు సదా జీవిస్తారు. చనిపోయినప్పటికీ ఆయన జీవిస్తున్నాడు.ఆయన్ని తలచుకోవడమంటే మన జీవితాలలోని అత్యంత ఆనందమయ సంఘటనలను మన స్మరణకు తెచ్చుకోవటమే’అని! ఆయనే వేరే సందర్భంలోగతపుముచ్చట్లు ప్రస్తావిస్తూ -”అప్పారావు గారి మనోభావములు, అభిరుచులు, ఆశయములు, ఉదాత్తములయినవి. నేటికాలపు వారికి వాటిలో కొన్ని నూతనములుగా కనపడకపోవచ్చును గాని, వారి కాలమునాటికి నూతనములు మాత్రమే కావు, విప్లవ కారకములుగా కూడా తోచినవి’ అన్నారు. ఆ భావజాలం, ఆ ఆశయప్రకటన -ఈనాటికీ అలాగేనిలిచివుండటంలోనే గురజాడ దార్శనిక శక్తి ప్రతిఫలిస్తోంది. ఇందుకుగల ఏకైక కారణం -వ్యక్తిగా,సాహిత్యశక్తిగా -మనసా వాచా కర్మణా ఆయన ప్రజల మనషిగా తన జీవితాన్నీ మనుగడనీ సమాజానికి అంకితం చేయటమే!అందుకే ఆయన యుగకర్తా, ధ్యన్యజీవీ!! ఆ స్ఫూర్తి జ్యోతి అఖండమైనదీ, అమరమైనదీనూ!
- విహారి
http://www.prabhanews.com/specialstories/article-390041