నిజానికి రాధికాస్వాంతనంముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో. మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను గమనించింది -మొల్ల రామాయణంలో 2400 శ్లోకాలు రాసిందని “మానుషి” అన్న ఇంగ్లీషు పత్రికలో చూసినప్పుడు. ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఆతరవాత లలిత, తారూ రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని. అప్పుడే నాకు మొల్లగురించిన ఆసక్తి మొదలయింది. ఇవి చదివినప్పుడు నాకు తోచిన మొదటి ఆలోచన శ్లోకం అన్నది సంస్కృత సాంప్రదాయవిశేషం. మొల్ల సంస్కృతాన్ని వదలి, జానుతెలుగులో రాయపూనుకున్న కవయిత్రి. ఆమె రచనని శ్లోకాలు అనడం ఆమెకి ఒక పాండిత్యస్థాయిని కల్పించడంకోసమేమో అనిపించింది. ఆరుద్ర మొల్ల రామాయణంలో ఉన్నవి 871 గద్యపద్యాలు అనీ, ప్రస్తుతం లభ్యమయిన ప్రతులు సమగ్రమయినవి కాకపోవచ్చు అనీ రాశారు (సమగ్రాంధ్ర సాహిత్యం, సం.2.). నాకు దొరికిన ప్రతిలో పద్యాలూ, వచనం ఒకే వరసలో లెక్కించి, మొత్తం ఆరుకాండలలో 880 ఉన్నట్టు చూపించారు. అందులో వచనంగా గుర్తించిన భాగాలు 208. అవి కొన్ని కేవలం ఒకటి రెండు మాటలు “అట్టి సమయంబున,” “అని మఱియును” లాటివి అయితే, కొన్ని దాదాపు ఒకపేజీ నిడివి ఉన్నాయి. మరో రెండు, మూడు చోట్ల గద్య అని కూడా ఉంది. దీనికి పీఠిక రాసినవారు (పరిష్కర్త కావచ్చు) క.కో.రా. అని ఉంది కానీ ఆయనెవరో నాకు తెలీదు. కోరాడ రామకృష్టయ్యగారేమో. రాసిన
మొల్లనిగురించి తెలిసింది చాలా తక్కువ అని మొదట్లో చెప్పేను. చదువుతున్నకొద్దీ, నాకు అబ్బురం అనిపించిన కొన్ని విషయాలు ముందు ప్రస్తావిస్తాను.
మొదటిది ఆమెపేరు, “కుమ్మర” మొల్లగా ప్రచారం కావడం. నేను చూసినంతవరకూ మరే ఇతర కవిని గానీ కవయిత్రిని గానీ కుల, వృత్తులపేరుమీదుగా ప్రస్తావించినట్టు కనిపించదు. ఆమె తనకు తానై ఎక్కడా తనపేరు “కుమ్మర మొల్ల” అని చెప్పుకోలేదు. మరి ఈ కుమ్మర అన్నపదం ఇంటిపేరుకి మారుగా ప్రాచుర్యంలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు.
పూర్వకవులు తమగ్రంథాదిని కులగోత్రాలు, వంశక్రమం చెప్పుకోడం సాంప్రదాయం. మొల్ల తాను రచించిన రామాయణానికి అవతారికలో “గురులింగజంగమార్చనపరుడు, శివభక్తరతుడు, బాంధవహితుడు” అయిన కేసయసెట్టి తనయనని చెప్పుకుంది. తండ్రినిగురించి రాస్తున్నప్పుడు కూడా కులప్రసక్తి కానీ వృత్తి ప్రసక్తి కానీ లేదు. అంచేత, ఈ కుమ్మర నామవిశేషణం ఆమెపేరుకి ముందు తగిలించడం, పరిష్కర్తలూ, ప్రచురణకర్తలూ చేసిన నిర్ణయంగానే కనిపిస్తోంది తప్ప మొల్ల అభిమతంగా తోచదు.
రెండవ అంశం “మొల్ల” అన్న పేరు ఆధారంగా పండితులు ఆమెవృత్తి లేక కులం నిర్ణయించ పూనుకోడం. ఈవిషయం ఆండ్ర శేషగిరిరావుగారు “ఆంధ్రవిదుషీమణులు” అన్న గ్రంథంలో విపులంగా చర్చించేరు. స్థూలంగా – మొల్లకనుపర్తి వరలక్ష్మమ్మగారు మొల్ల తన రామాయణంలో వేశ్యలగురించి ప్రస్తావించినతీరు చూస్తే, ఆమె వేశ్య కాదని స్పష్టంగా తెలుస్తుంటారు. శేషగిరిరావుగారు కూడా ఆమె కులటాంగన కాదనే నిర్ధారించేరు. మల్లియజాతికి చెందినపువ్వు. పూర్వకాలంలో పువ్వులపేర్లు వేశ్యలు మాత్రమే పెట్టుకునేవారుట. అంచేత ఆమె వేశ్య కావచ్చునని ఒక వాదన. ఈవాదనకి ప్రతిగా
మొల్ల కాలనిర్ణయం చేసినప్పుడు కూడా ఆమె రామాయణంలోని అవతారికే ఆధారమయింది. అందులో ఆమె గౌరవపురస్సరంగా పేర్కొన్న పూర్వకవులు ఆధారంగా ఆమె పదహారవ శతాబ్దం కృష్టదేవరాయలకాలంలో జీవించి ఉండవచ్చునని నిర్ణయించేరు. ఇక్కడ నాకు కలిగిన సందేహం – మొల్ల తన రామాయణంలో పేర్కొన్నకవులు గుర్తుగా వారి జీవితకాలం ఆధారంగా ఆమె కాలనిర్ణయం చేసేరు కానీ ఆమెతరవాత కవులు ఎవరైనా ఆమెని పేర్కొన్నారో లేదో వివరించలేదు. నేను సాహిత్యమంతా తరిచి చూడలేదు కానీ పైన పేర్కొన్న పండితులు పేరెన్నిక గన్నవారే. వారి వ్యాసాలలో ఈ ప్రస్తావన లేదు. శేషగిరిరావుగారు ఏదో ఒక ఉదాహరణ చెప్పేరు కానీ మళ్లీ అది మొల్లగురించి కాదేమోనన్న సందేహం కూడా వెలిబుచ్చారు. మరి మొల్లని ఆమెకాలంలోనూ, ఆ తరవాతా ఎవరైనా ఆమెను రామాయణకర్త్రిగా గుర్తించి ప్రశంసించేరా లేదా, ఈ విషయంలో పరిశోధన ఏమైనా జరిగిందా లేదా అన్నది తెలిసినవారెవరైనా చెప్పాలి.
విద్య మాటకొస్తే, తాను అట్టే చదువుకోలేదని ఆమె వినయంగా చెప్పుకున్నా, ఆమెరచనలో చమత్కారాలూ, పాండిత్యప్రకర్షా, పూర్వకవుల గ్రంథాల్లో భాషగురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు చూస్తే, ఆమె విస్తృతంగా కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నట్టే కనిపిస్తుంది. ఉదాహరణకి, అవతారికలో ఈ పద్యం చూడండి.
దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్
సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రపంధము
లాయా సమాసంబులర్థములును
భావార్థములుఁ గావ్యపరిపాకములు రస
భావచమత్కృతుల్ పలుకుసరవి
బహువర్ణములును విభక్తులు ధాతు లం
లంకృతి చ్ఛంధోవిలక్షణములుఁ
గావ్యసంపదక్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుఁగ విఖ్యాత
గోపవరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి.
పైపద్యంలో వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టాఆవర్జాలు వల్లించడం ఏమీ తెలీనివారికి సాధ్యం కాదు కదా. అంతే కాదు, తాను సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణానికి తెలుగుసేత చేస్తూ, మళ్లీ అందులో సంస్కృత సమాసాలు వాడడం సముచితం కాదంటుంది.
తాను అలా “కావ్యసంపదక్రియల” జోలికి పోనని చెప్పి, పదం చూడగానే పాఠకుడికి అర్థం తోచని భాషలో రాస్తే అది మూగ, చెవిటివారు ముచ్చటలాడినట్టే ఉంటుందంటూ హాస్యమాడుతుంది..
తేనె సోఁక నోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగచెవిటివారి ముచ్చట యగును.
నాలుకకి తేనె తగలగానే నోరు తీయన అయినట్టే పదానికి అర్థం చదువుతుండగానే పాఠకుడికి స్ఫురించాలి అని ఆమె అభిమతం!
తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాటివి ఉన్నాయి. సాయంశోభని వివరిస్తూ చెప్పినపద్యాలలో మచ్చుకి ఒకటి -
మేలిమి సంధ్యారాగము
వ్రాలిన చీకటియు గఁలిసి వరుణునివంకన్
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టే నట నభోమణి తలగన్.
సాయంకాలపు నీరెండ, కమ్ముతున్న చీకటులతో కలిసి నీలాలూ, కెంపులూ అతికినట్టున్నాయిట ఆకాశంలో.
పాఠకులమనసుని అలరించే చమత్కారాలూ (కందువలు) సామెతలూ కూర్చి అందంగా చెప్తే వీనులవిందుగా ఉంటుంది అంటుంది మొల్ల.
కందువమాటలు సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెలుఁగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధులమదికిన్.
ఆండ్ర శేషగిరిరావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మవంటి అనేక ప్రముఖులు మొల్ల తన రామాయణాన్ని జానుతెనుగులో, సులభశైలిలో సకలజనులకూ అర్థమయేరీతిలో రాసింది అని మెచ్చుకున్నారు. మొల్ల కూడా అలాగే తన రామాయణం “మూగ చెవిటి ముచ్చట” కాకుండా ఉండేలా రాయదల్చుకున్నట్టు చెప్పుకుంది. ఆమెరచనలో చవులుఁ బుట్టు జాతీయాలు కోకొల్లలుగానే ఉన్నా, సంస్కృత సమాసాలు, ముఖ్యంగా యుద్ధవర్ణనలో, నాయకీ, నాయకుల వర్ణనలలో క్లిష్ట భూయిష్టమయిన సంస్కృతసమాసాలు చాలానే కనిపించేయి. నేను చాలాచోట్ల తడుముకోవలసివచ్చింది అర్థంకోసం. “జాను తెనుగు,” “వాడుకభాష” లాటి పదాలకి ఆనాడు ఉన్న అర్థాలు ఈనాడు అన్వయించుకోలేం అనుకోవాలి.
మూలరామాయణంలో లేని కొన్ని సన్నివేశాలు మొల్ల స్వతంత్రించి ఇతర రామాయణాలనుండి స్వీకరించడం జరిగింది. అయోధ్యకాండలో రాముడు స్వర్ణనది దాటేముందు గుహుడు ఆయనపాదాలు కడగడం వాటిలో ఒకటి.
సుడిగొని రాముపాదములు సోఁకి ధూళివహించి ఱాయెయే
యేర్పడ నొక కాంతనయ్యెనఁట పన్నుగనీతని పాదరేణువి
య్యడవడి నోడసోఁకనిదియేమగునో యని సంశయాత్ముఁడై
కడిగెగుహుండు రాముపదకంజయుగంబు భయమ్ముపెంపునన్.
ఈ సన్నివేశం వాల్మీకిరామాయణంలో లేదు కానీ అధ్యాత్మరామాయణంలో ఉందని ఆరుద్ర అంటున్నారు. అలాగే మరో సన్నివేశం – పరశురాముడు రాముడిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వడం కూడా వ్యాస రామాయణంలో లేదనీ, భాస్కరరామాయణంనుండి తీసుకున్నదనీ అంటున్నారాయన. వీటివల్ల మొల్ల విస్తృతంగా తెలుగు, సంస్కృతగ్రంథాలు చదివిందనే అనుకోవాలి. ఈ గుహుడికథ చిన్నప్పడు నాలుగోక్లాసు, ఐదోక్లాసు వాచకాల్లో ఉండేది. ఈ కథ అంత ప్రాచుర్యం పొందడానికి మొల్ల రామాయణమే కారణం కావచ్చు.
*******************************************************
నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.
మదనాగయూధసమగ్రదేశము గాని
కుటిలవర్తనశేషకులము గాదు.
ఆహవోర్వీజయహరినివాసము గాని
కీశసముత్కరాంకితము గాదు
సుందరస్యందనమందిరంబగు గాని
సంతతమంజులాశ్రయము గాదు
మోహనగణికాసమూహగేయము గాని
యూధికానికరసంయుతము గాదు
సరససత్పుణ్యజననివాసము గాని
కఠిననిర్దయదైత్యసంఘము గాదు
కాదు కాదని కొనియాడఁ దగినట్టి
పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.
“కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం చూడగలం. ముందు చెప్పేను ఆమె కవిత్వంలో సంస్కృతసమాసాలు విశేషంగా ఉన్నాయని. అది కూడా పైపద్యంలో గమనించవచ్చు.
అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం -
ఏమృగంబును గన్నఁ నేణాక్షి గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
ఏపక్షిఁ గనుగొన్న నెలనాగ గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
… … …
సీత గానఁబడమి శ్రీరామచంద్రుండు
విరహతాపవహ్ని వేఁగి వేఁగి
అంటూ సీతకోసం ఆయన అనుభవించిన వేదనని పాఠకులమనసుకి గట్టిగా తగిలేలా చెప్తుంది మొల్ల. ఈ ప్రయోగం యుద్ధకాండలో నిశేషించి ఇతోధికంగా భావసమన్వితమవుతుంది. మూడు ఆశ్వాసాలలో ఆమె చేసిన యుద్ధవర్ణన చదువుతుంటే స్వయంగా యుద్ధం చూసైనా ఉండాలి, లేదా యుద్ధానికి సంబంధించిన గ్రంథాలు విశేషంగా చదివి అయినా ఉండాలి అనిపించకమానదు.
మొల్ల పదాలు వాడుకోడంలో పొదుపరి, ఆమెకి ఆమెయే సాటి అంటూ మలయవాసిని, ఆరుద్ర సుందరకాండలో రామలక్ష్మణులని వర్ణించమని సీత హనుమంతుని అడిగిన సందర్భం ఉదహరిస్తున్నారు. హనుమంతుడు నిజంగా రాముని పంపున వచ్చినవాడవునో, ఇది కూడా రాక్షసమాయేనేమో నన్న సందేహంతో సీత వారిని వర్ణించమంటుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు.
సీ. నీలమేఘచ్ఛాయఁ బోలు దేహము వాఁడు
ధవళాబ్దపత్రనేత్రములవాఁడు
కంబుసన్నిభమైన కంఠంబు గలవాఁడు
బాగైనయట్టి గుల్భములవాఁడు
…. … ….
అని రాముని వర్ణించి, లక్ష్మణుని,
ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాఁడు.
అంటాడు. లక్ష్మణుడిని గురించి మళ్లీ వేరే చెప్పక్కర్లేదు. ఆయనకి కూడా ఈవర్ణనంతా సరిపోతుంది, రంగు మాత్రమే వేరు అని. పైన చెప్పినట్టు ఈపద్యం కూడా నేను చిన్నప్పుడే విన్నాను కానీ ఇది మొల్లవిరచితమని ఇప్పుడే తెలిసింది!
పూర్వకవులు మొల్ల పాండిత్యాన్ని స్పృశించినట్టు కనిపించదు కానీ ఆధునికకాలంలో పండితులు కొందరైనా ఆమె కవిత్వాన్ని తమ వ్యాసాల్లో చర్చించారు.
దివాకర్ల వెంకటావధానిగారు, “తానంత విద్యాసంపన్నురాలు కాదని చెప్పుకొన్నా ఈమె కావ్యమున పాండిత్యలోపమెచ్చటను కానిపింపదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచిములయి మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేతనగరవర్ణనము శ్లేష శబ్దాలంకారపూరితమై ఆమె పాండితీవిశేషమును పలు విధముల సూచించుచున్నది” అంటారు. “ఈమె శైలిని మృదుమధురపద గుంఫితమును, భావబంధురమునై సర్వజనరంజకముగా నుండును”, “ఔచిత్యపోషణలో కూడా అందె వేసిన చేయి” అని కూడా ప్రశంసించారు. (ఆంధ్ర వాఙ్మయచరిత్ర, పు 59-50).
అయితే ఈ ఔచిత్యపోషణవిషయంలో ఆండ్ర శేషగిరిరావుగారి అభిప్రాయం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఆమె స్త్రీవర్ణనలోనే కాక ఇతర సందర్భాలలో కూడా స్త్రీల శరీరభాగాలు ఉపమించడంలో “పూర్వకవి సాంప్రదాయాన్ని పాటించుట విశేషము” అంటారు. శేషగిరిరావుగారు ఈవిషయాన్ని మూడు పేజీలనిడివిలో చర్చించడం నాకు విశేషంగా అనిపించింది!
నేను ఈవ్యాసం రాయడానికి ఉపక్రమించిన తరవాత, మొల్ల సినిమాగా కూడా వచ్చిందని సౌమ్య చెప్పింది. ఈసినిమా వచ్చేవేళకి అంటే 1970లో నేను ఇండియాలోనే ఉన్నాను. అప్పట్లో సినిమాలు బాగానే చూసేదాన్ని కూడా. అయినా ఎంచేతో ఇది మాత్రం నాదృష్టికి రాలేదు. ఇప్పుడు లైబ్రరీలో పుస్తకాలు చూస్తుంటే ఇంటూరి వెంకటేశ్వరరావు మొల్ల జీవితం ఆధారంగా రాసిన నవల, ఆ నవల ఆధారంగా సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ కనిపించేయి. ఈ నవలవిషయంలో మహానటుడు చిత్తూరు నాగయ్య కథాగమనంవిషయంలో వెంకటేశ్వరరావుతో విబేధించేరని ఇద్దరూ తమ ముందుమాటలలో చెప్పుకున్నారు. ఆ అభిప్రాయబేధాలు ప్రత్యేకించి ఏవిషయంలోనో తెలీదు గానీ నాకు అభ్యంతరకరంగా అనిపించిన విషయాలు ప్రస్తావిస్తాను.
ప్రాక్తనకవులగురించి చదువుతున్నప్పుడు సహజంగానే ఆ కాలంలో ఆచారవ్యవహారాలగురించి కూడా తెలుసుకోగలుగుతాం అన్న ఆశ ఉంటుంది మనకి. సుప్రసిద్ధ కవులజీవితాలకీ, ఆనాటి సాంఘికపరిస్థితులకీ అవినాభావసంబంధం ఉంటుంది. మనఅవగాహన కూడా పరస్పరానుబంధంగానే ఉంటుంది. అంటే ఒకటి తెలిస్తే, రెండోది మరింత విపులంగా తెలుస్తుంది. అంచేతే ఏదో ఒక ఎజెండా పెట్టుకుని రచయితలు తమ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేస్తే, అది సాహిత్యానికి ద్రోహమే అవుతుంది. రచయితలో నిజాయితీ లోపించినట్టే అనిపిస్తుంది.
పలువురి ప్రశంసలు పొందిన ఒక సుప్రసిద్ధ కవయిత్రిని తీసుకుని నవల రాస్తున్నప్పుడు ఆ గౌరవం అలా నిలబెట్టేదిగా ఉండాలి రచన. అంతేకానీ తమ రాజకీయసిద్ధాంతాలు ప్రచారం చేసుకోడానికి ఆ పాత్రని తమ ఇష్టంవచ్చినట్టు మలచడం ఆపాత్రని అగౌరవపరచడమే అని నా అభిప్రాయం..
ఈనవలలో రచయిత మొల్ల చిన్నతనంలో అనాగరీకంగా, విసృంఖలంగా ప్రవర్తించినట్టు చిత్రించారు. ఆనాటి సాంఘికదురన్యాయాలు దుయ్యబట్టడం మొల్లద్వారా జరిగినట్టు చూపించడంకోసం అలా చిత్రించడం జరిగినట్టుంది. నిజానికి ఆనాటి సాంఘిక దురన్యాయాలు నిరసించడానికి మొల్ల వ్యక్తిత్వాన్ని వక్రీకరించనవసరం లేదనే నా అభిప్రాయం. సమర్థుడయిన రచయిత ప్రచారంలో ఉన్న వ్యక్తిత్వాలని యథాతథంగా వాడుకుంటూనే, కథని నడిపించగలడు. గలగాలి. అంతటి బలమైన మరొక పాత్రని సృష్టించలేక, మొల్లని వాడుకున్నట్టు అనిపించింది నాకు ఈనవల చదువుతుంటే. నాదృష్టిలో ఇది నవలారచనలో లోపమే.
రెండో అభ్యంతరం – అలా మొల్ల పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తుండగా, ఒక దేవదాసి ఉద్బోధనతో జ్ఞానోదయమై, అడవులకు పోతుంది. అక్కడ ఒక సుందరాకారుడు కనిపించి మొల్లకి “ఆడదాని”లా ప్రవర్తించడం, సిగ్గు పడడంతో సహా, నేర్పి ఆమెని “నిజమైన ఆడదాన్ని” చేస్తాడు. ఇది కూడా నాకు అసంబద్ధంగానే అనిపించింది.
ఆమె రచించిన రామాయణంలో అవతారికలోనూ, చివర మంగళాశాసనంలోనూ కూడా తాను శ్రీగౌరీశవరప్రసాద లబ్ధననీ, గురుజంగమార్చనవినోద, సూరిజనవినుత, నిత్యశైవాచార సంపన్న, కవితాచమత్కారి అయిన ఆతుకూరి కేసనసెట్టి తనయననీ, మొల్ల నామధేయననీ చెప్పుకుంది. మహాభక్తుడూ, కవీ అయిన కేసనసెట్టి ఇంట పెరిగిన మొల్లని అదుపాజ్ఞలు లేక దుడుకుగా ప్రవర్తించిన అనాగరీకురాలుగా ఊహించడం సమర్థనీయంగా తోచడంలేదు నాకు. అంతేగాదు. ఆమె రచించిన గ్రంథంలో ఎనలేని పాండితీగరిమ ప్రదర్శించింది. అంతటి పాండిత్యం శ్రద్ధగా నిష్ఠతో ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప రాదు. పరమ నిష్ఠాగరిష్ఠుడయిన తంఢ్రి శిక్షణలో ఆమె విద్యావతిగానే పెరిగినట్టు కనిపిస్తోంది.
సినిమావిషయం నాస్నేహితురాలు వైదేహికి చెప్తే, తను ఇంటర్నెట్లో ఉందని నాకు లింకు పంపింది. సినిమాగా బాగుంది. బహుశా మొల్ల పేరు పెట్టకుండా మరో బలమైన స్త్రీపాత్రని సృష్టించి తీసినా ఆ సినిమాకి లోపమేమీ ఉండేది కాదేమో.
మొల్ల రామాయణం పండితులనీ పామరులనీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. కారణం ఆమె పాండిత్యమే కానీ ఆమె కుమ్మరి వంశజురాలు కావడం కాదు. ఆమెచుట్టూ అల్లినకథలు ఆ కావ్యాన్నే ఆధారం చేసుకుని, ఆ గౌరవాన్ని ఇనుమడించేలా చేయడమే సమంజసం.
మొల్లకి పూర్వం చాలామంది మగకవులు రామాయణాలు రాశారు కానీ మొల్ల రామాయణం మాత్రమే కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచింది అన్నారు ఆరుద్ర సమగాంధ్ర. సాహిత్యం, 2వ సంపుటంలో. ఈ ఒక్కవాక్యం చాలు మొల్ల కవితాప్రౌఢిమ ఎంతటి పటిష్ఠమైనదో ఘనతరమైనదో చెప్పడానికి.
ఈ రామాయణం అంతర్జాలంలో లభ్యం. పాఠకులసౌకర్యార్థం పిడియఫ్ ఫైలు ఇక్కడ
నిడదవోలు మాలతి ..తెలుగు సాహిత్యం దాట్కాం సౌజన్యంతో
చిత్రాలు-వికీపీడియా