భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం.
సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
వంశం
సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు.
రామరాజు, సీతారామరాజు
అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంధం అట్టపైన కూఢా "శ్రీరామరాజు", "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. (సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును "సీతారామరాజు"గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాధ.)